రైలులో దారుణం… భార్య కోసం సీటు అడిగితే చంపేశారు…

ముంబై-లాతూర్-బీదర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం జరిగింది. రైలులో తన భార్య కూర్చునేందుకు సీటు అడిగినందుకు ఓ యువకుడిని ఆరుగురు మహిళలు సహా 12 మంది కలిసి చితకబాది చంపేసిన ఘటన ముంబై-లాతూర్-బీదర్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన సాగర్ మర్కంద్ తన భార్య, రెండేళ్ల చిన్నారితో కలిసి కళ్యాణ్‌లో బీదర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. జనరల్ బోగీ కావడం.. రద్దీ ఎక్కువగా ఉండడంతో తన భార్య కూర్చోవడం కోసం సీటు సర్దుకోవాలని ఓ సీటులో కూర్చున్న మహిళను కోరాడు. ఇందుకు సదరు మహిళ నిరాకరించి సాగర్‌తో వాగ్వాదానికి దిగింది. వాగ్వాదం కాస్త వివాదంగా మారి ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఆ మహిళతో పాటు ఉన్న 12 మంది ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. బాధితుడి భార్య కొట్టొద్దని చెబుతున్నా వినకుండా గంటపాటు విపరీతంగా కొట్టారు. పూణే నుంచి దౌండ్ స్టేషన్ వరకు బాధితుడిపై దాడిని ఆపలేదు. దౌండ్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాగర్ కుటుంబం షోలాపూర్ జిల్లాలో బంధువు అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Related posts

Leave a Comment