సీరియల్ నటి దారుణ హత్య… పది రోజుల తర్వాత వెలుగులోకి…

ఓ సీరియల్ నటిని తన భర్త దారుణంగా హత్య చేశాడు. తన మిత్రుడితో కలసి ఆమెను అంతం చేశాడు. అనంతరం ఆమె శవం కూడా కనిపించకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఢిల్లీకి చెందిన అనిత సీరియల్ నటి. పలు టీవీ షోల్లో నటిస్తూ ఉంటుంది. అయితే, ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త రవీంద్రపాల్ అనుమానం. ఈ క్రమంలో తన భార్యను చంపాలని అతడు పథకం పన్నాడు. జనవరి 30న ఆమెను తీసుకుని బస్సులో వెళ్లాడు. తనకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు ముంబైలో టీవీ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాడని చెప్పాడు. అతడిని కలిస్తే టీవీ సీరియల్స్‌లో మంచి అవకాశాలు రావడంతో పాటు, కెరీర్ బాగా పుంజుకుంటుందని ఆమెను నమ్మించాడు. భర్త చెప్పిన మాటలు విన్న అనిత అతడితో కలసి వెళ్లింది. అనిత, ఆమె భర్త రవీంద్రపాల్‌తో పాటు అతడి మిత్రుడు కుల్దీప్‌ కలసి ఉత్తరాఖండ్ వెళ్లారు. అక్కడ ఆమెకు టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు రవీంద్ర. అనంతరం ఆమె స్పృహకోల్పోయిన తర్వాత తాడుతో ఉరివేసి ప్రాణం తీశారు. ఆ తర్వాత తమతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి ఆమె మృతదేహాన్ని అక్కడే కాల్చారు.

జనవరి 31న ఓ మహిళ మృతదేహాన్ని కాలిన స్థితిలో చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణను మొదలు పెట్టిన పోలీసులు ఆ చుట్టుపక్కల రోడ్ల మీద సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఓ కారులో మహిళ ఉన్నట్టు గుర్తించారు. ఆ కారు నెంబర్ తీసుకుని విచారణ చేస్తే రమన్‌జిత్ అనే వ్యక్తికి చెందినదిగా తెలిసింది. అతడిని విచారణ చేసిన పోలీసులకు కొత్త విషయం తెలిసింది. ఆ కారును జనవరి 30న తన బావ కుల్దీప్ తీసుకుని వెళ్లినట్టు చెప్పాడు. ఆ కుల్దీప్‌ను పట్టుకుని విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.

తన ఫ్రెండ్ రవీంద్రపాల్ కోసం తాను ఆ పని చేశానన్నాడు. రవీంద్రను పట్టుకుని పోలీసులు తమదైన శైల్లో విచారించగా, అసలు విషయాన్ని కక్కాడు. తన భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం ఆమె మొబైల్ ఫోన్ ఛాటింగ్ ద్వారా తనకు తెలిసిందని పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. అది తట్టుకోలేక ఆమెను హత్య చేసినట్టు అంగీకరించాడు. గతంలో కూడా ఆమెను చంపాలనుకున్నానని, కుదరలేదని తెలిపాడు. ఈసారి తన మిత్రడి సాయంతో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు అంగీకరించాడు.

పోలీసులు నిందితులు వాడిన కారు, రెండు మొబైల్ ఫోన్లు, హత్య చేసిన రోజు వారు వేసుకున్న దుస్తులు, పెట్రోల్ కోసం వినియోగించిన డబ్బా, ఇతర వస్తువులను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Tags : crime news , delhi , uttarkhand

Related posts

Leave a Comment