నేర చరితుల సంగతేంటి? రాజకీయ పార్టీలను ఉతికారేసిన సుప్రీంకోర్టు

మంచి నేతలు ఉన్న దేశం మంచిగా అభివృద్ధి చెందుతుంది. అదే నేర చరిత్ర ఉన్న వాళ్లు నేతలైతే… కొంపలు మునుగుతాయి. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నేర చరిత్ర ఉన్న వాళ్లను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడం చట్ట ప్రకారం నేరం కాబట్టి… రాజకీయ పార్టీలు అలా చేస్తే… అవి చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రూల్ ఎవరైనా అతిక్రమిస్తే… కేంద్ర ఎన్నికల సంఘం కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు రాజకీయ పార్టీలు ఇప్పటివరకూ నేర చరిత్ర ఉన్నవారిని ఎందుకు ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడుతున్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం… సంచలన తీర్పు ఇచ్చింది. అభ్యర్థులుగా నిలబడే వారంతా… తమ నేర చరిత్ర, తమపై ఉన్న పెండింగ్ కేసుల వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల నేర చరిత్ర, పెండింగ్ కేసులు, వాళ్లు సాధించిన విజయాలు వంటి వివరాలన్నీ న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్లలో 48 గంటల్లో పెట్టాలని ఆదేశించింది. ఎందుకు ఆ అభ్యర్థుల్ని ఎంపిక చేసిందీ చెప్పాలని ఆర్డరేసింది.

తాజా గణాంకాల ప్రకారం… 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది విజేతల్లో… 233 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009లో ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల కంటే… ఇవి 44 శాతం ఎక్కువ. దీనిపైనే సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఏటికేడాది నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య తగ్గాల్సింది పోయి… మరింత ఎక్కువ మంది అలాంటి వాళ్లనే అభ్యర్థులుగా ఎందుకు పెడుతున్నారన్నది సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్న. మరి ఇప్పటికైనా పార్టీలు బుద్ధి తెచ్చుకుంటాయో… లేక… క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్లనే ఎంపిక చేస్తాయో చూద్దాం.

Tags : suprem court , crime news , crime politics ,

Related posts

Leave a Comment