తుది మెరుగులు దిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం

సిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త చెప్పారు ఆలయ అర్చకులు. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తైంది. చిన్నా చితకా పనులు మాత్రమే మిగిలివున్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తవ్వనున్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆలయాన్ని అతి త్వరలో సంప్రదాయబద్ధంగా, మంచి మహూర్తంలో ప్రారంభించి… లక్ష్మీనరసింహస్వామి విగ్రహ మూర్తులను ప్రతిష్టించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా రానుండటం అందరికీ తెలిసిన విషయమే. అసలీ ఆలయ నిర్మాణం కోసం కేసీఆర్ ఎంతగానో శ్రమించారు. దేశంలోనే అత్యద్భుత ఆలయాల్లో ఒకటిగా యాదాద్రి నిలవాలని ఆకాంక్షించారు. అందుకోసం ప్రత్యేక నల్లరాతిని తెప్పించారు. వేర్వేరు రాష్ట్రాల నుంచీ శిల్పులను పిలిపించారు. ఏడు గోపురాలతో కూడిన ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా… నిధుల విషయంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఇప్పటికే యాదాద్రి కొత్త ఆలయాన్ని, బాలాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

యాదాద్రి ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ దాదాపు తిరుమలలాగా పార్కులు, సందర్శన ప్రదేశాలతో నిండిపోయేలా ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు చేపట్టింది. అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చటి ప్రకృతి, పూల మొక్కలతో అద్భుతంగా ఉంది. ఇదే సమయంలో యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రి కూడా త్వరలో రాబోతోంది.

ఏపీలో తిరుమల, సింహాచలం, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం ఇలా చాలా ఆలయాలున్నాయి. అవన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. తెలంగాణలో మాత్రం చాలా ఆలయాలు ఇప్పటికీ నిధుల కొరత వేధిస్తోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత… ఆలయాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయించి, అమల్లోకి తెచ్చారు. అందువల్లే యాదాద్రి ఆలయం సప్త గోపురాలతో అద్భుతంగా కనిపిస్తోంది ఇప్పుడు.

స్పీడ్ పోస్టులో ప్రసాదం : ఇటీవల తెలంగాణ దేవాదాయ శాఖ… భక్తులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఇకపై యాదాద్రి స్వామి అమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి స్పీడ్ పోస్టులో చేర్చేలా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ సేవలు అమల్లోకి రానున్నాయి. ఈ సేవల కోసం ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశాక… పోస్టల్ సిబ్బంది ద్వారా సేవలు లభిస్తాయి. ఈ నెలాఖరుకల్లా ఈ సేవల్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం రెడీ అవుతోంది.

Tags : Telangana News , Yadadri , yadadri temple

Related posts

Leave a Comment