గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ ఆత్మహత్యాయత్నం

కరోనా వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొని వేటుకు గురైన గాంధీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కొద్దిసేపటి క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ వసంత్… పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆయనను ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే వసంత్ మాత్రం ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో… గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో వసతులు లేమిపై తాను ప్రశ్నించడం వల్లే తనపై వేటు వేశారని ఆయన అన్నారు. తాను మంత్రిని కలిశానని… ఆయన నుంచి ఎలాంటి హామీ లభించిందని అన్నారు. చేయని నేరానికి తాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేనని వసంత్ అన్నారు. దీనిపై సూపరిండెంట్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఎవరినీ దగ్గరకు రానీయకపోవడంతో… ఆస్పత్రి ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు.

అంతకుముందు కరోనా వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ వసంత్‌కుమార్‌పై వేటు పడింది. ఆసుపత్రి క్యాజువాలిటీలో పనిచేస్తున్న ఆయనను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేస్తూ వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గాంధీలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వచ్చిన వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తర్వాత ఇది అవాస్తవమని తేలడంతో ఆసుపత్రి వర్గాలు విచారణ కమిటీ వేశాయి. డాక్టర్‌ వసంత్‌కుమార్‌ దీనంతటికీ కారణమని గుర్తించి సరెండర్‌ చేశారు. గాంధీలో కరోనా ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు తగిన పరిస్థితులు లేవంటూ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి సైతం డాక్టర్‌ వసంత్‌ తప్పుడు సమాచారం అందించినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో ఆయనకు సహకరించిన మరో డాక్టర్‌కు షోకాజ్‌ ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Tags : gandhi hospital , Telangana

Related posts

Leave a Comment