పతంగుల పండుగ అంబరాన్నంటాలి

అంతర్జాతీయ పతంగుల పండుగను అంబరాన్నంటేలా ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిడేలా అంతర్జాతీయస్థాయిలో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ఉండాలని అధికారులకు సూచించారు. పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన బేగంపేటలోని హోటల్‌ ప్లాజాలో ఐదో ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫెస్టివల్‌ బ్రోచర్‌, వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జింఖానా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీవరకు ఐదో ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 50 దేశాలకుపైగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కైట్‌ ప్లేయర్స్‌.. దేశీయంగా 25 రాష్ట్రాల నుంచి కైట్‌ క్లబ్స్‌ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌, ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment