అమరావతిపై జగన్ మాట తప్పారు: పవన్ కల్యాణ్

వైసీపీ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి విషయంలో ప్రభుత్వమే మాట తప్పిందని ఆరోపించారు. అమరావతిలోని రాజధాని రైతులతో సమావేశమైన ఆయన.. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సర్కార్ ఆనాడు 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందని.. కానీ ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేరని.. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందన్నారు. పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రైతులు భూమిలిచ్చారని.. చంద్రబాబుపై, ఓ వ్యక్తిపై భరోసాతో రైతులు భూములివ్వలేదన్నారు. ప్రభుత్వంపై భరోసాతో రైతులు భూములిచ్చారన్నారు. ప్రభుత్వమే మాట తప్పడం దారుణమన్నారు.

అమరావతి రాజధానికి అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్‌ ఆమోదం తెలిపారని.. ఆనాడు ఆయన స్పష్టత ఇచ్చుంటే బాగుండేదన్నారు. ఆరోజు ఆయన గట్టిగా వ్యతిరేకించి ఉంటే.. రైతులు అన్ని భూములు ఇచ్చేవారు కాదన్నారు. ఆయన ధర్మం తప్పారని… మాట తప్పితే ధర్మం తప్పినట్టేనన్నారు. మాట తప్పితే ఈ నేల క్షమించదని ఘాటుగా వ్యాఖ్యానించారు. భూములమ్మితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసు అన్న ఆయన.. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చింది… అస్థిరత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

Related posts

Leave a Comment