రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులే

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ.. ప్రజా రవాణా శాఖగా మారిపోయింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు. అధికారుల హోదాలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆర్టీసీ ఎండీ హోదాను పీటీడీ కమిషనర్‌ లేదా డైరెక్టర్‌గాను, ఈడీలను అడిషనల్‌ కమిషనర్లుగా, ఆర్‌ఎంలు జాయింట్‌ కమిషనర్లుగా, డీవీఎంలు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లను అసిస్టెంట్‌ కమిషనర్లుగా వ్యవహరించాలని జీవోలో పేర్కొంది. ఆర్టీసీ సిబ్బందికి సీఎ్‌ఫఎంఎస్‌ నుంచి జీతాల చెల్లింపు జరుగుతుందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగే వరకు ఆర్టీసీ సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న అలవెన్సులు కొనసాగుతాయని తెలిపింది. అయితే పీఆర్‌సీ వచ్చాక వీటిని కొనసాగిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. జనవరి 2020 నుంచి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని చెప్పిన అధికారులు అందుకు అనుగుణంగానే ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో మొత్తం 51,488 మంది ఆర్టీసీ సిబ్బంది పీటీడీలో విలీనం కాబోతున్నారు. కార్పొరేషన్‌గా కొనసాగుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది.

Related posts

Leave a Comment