ఉడ్‌తా హైదరాబాద్

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది! యువత న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతోంది! నగరంలో ఇప్పుడు ‘కొత్త మత్తు’ తలకెక్కుతోంది! కొత్త సంవత్సరం వేడుకల కోసం ఇప్పటికే పెద్దఎత్తున డ్రగ్స్‌ దిగుమతి జరిగిందనే సమాచారం పోలీసులకు అందింది. నిన్న మొన్నటి వరకూ పబ్‌లకే పరిమితమైన మాదక ద్రవ్యాలు ఇప్పుడు శివారుకూ పాకుతున్నాయి. ఒకప్పుడు మద్యం, ఆటపాటలకే పరిమితమైన న్యూ ఇయర్‌ పార్టీల్లో ఇప్పుడు డ్రగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. గతంలో విదేశీయులే హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేసేవారు. ఇప్పుడు స్థానికులే డ్రగ్స్‌ వ్యాపారుల అవతారం ఎత్తారు.

ఒకటి రెండు దాడుల్లో స్వల్ప మొత్తంలో డ్రగ్స్‌ పోలీసులకు దొరికినా.. బడా సరఫరాదారులు మాత్రం యథేచ్ఛగా దందా కొనసాగిస్తూనే ఉన్నారు. పండగలు, ఈవెంట్లు, న్యూ ఇయర్‌, పబ్‌లు, బార్‌లు, రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లతోపాటు పోలీసు నిఘా ఉండదనే ధీమాతో డ్రగ్స్‌ సరఫరాదారులు శివారు ప్రాంతాలను కూడా దాటేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ నగరానికి, శివారు ప్రాంతాలకు తరలుతున్నాయి. ఈ ఏడాది డ్రగ్స్‌ రవాణా కేసులు విపరీతంగా పెరిగాయి. సరఫరాదారుల సంఖ్య కూడా పెరిగింది.

డ్రగ్స్‌కు అలవాటు పడి కొంతమంది.. అధిక సంపాదన కోసం మరికొంతమంది.. తెలిసీ తెలియక ఇంకొందరు విష దందాలో భాగస్వాములవుతున్నారు. డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి గత ఏడాది 55 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 88 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 133 మంది అరెస్టు కాగా ఈ ఏడాది 196 మంది చిక్కారు.

Related posts

Leave a Comment