విప్లవ నాయకి ‘శక్తి’మంతంగా…!

ఒక సాదాసీదా అమ్మాయి ఉక్కు మహిళగా మారాలంటే… జీవితం ఆమెకు ఎన్నో పోరాటాలను నేర్పించి ఉండాలి. అనుభవం ఆమెకు సహనాన్ని, సాహసాన్ని బోధించి ఉండాలి. మారుతున్న కాలాన్ని, మనుషులను అంచనా వేసే ‘శక్తి’ని ఆమె సాధించి ఉండాలి. పదేళ్ల వయసున్న తెలివైన అమ్మాయి శక్తి శేషాద్రి (అనికా) ‘‘ఇంట్లో ఉండటం కన్నా నాకు బడికి రావడమే ఇష్టం’’ అంటుంది. స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్‌ ఫ్లావియా ‘నొప్పి ఉన్నా కూడా…’ అంటూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చూసిన చూపులో ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. అందరు ఆడపిల్లల్లాంటి అందమైన బాల్యం కాదు శక్తిది. అంత చిన్నవయసులోనే ఆ తెలివైన పిల్లకు అనేక కష్టాలు అది కూడా తల్లి రంగనాయకి (సోనియా అగర్వాల్‌) రూపంలో. కూతురు తన కనుసన్నల్లోనే మెలగాలని ఆమె ఆంక్షలు పెడుతుంది. అసలు ఆమెకు కూతురు చదువుకోవడం కూడా ఇష్టం లేదు.

కానీ శక్తి మాత్రం స్కూల్లో బ్రిలియంట్‌ స్టూడెంట్‌. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ఆమె సత్తా చాటుకుంటుంది. 14 ఏళ్ల ప్రాయంలో ఆమె కంటినిండా కలలే. అయితే తన జీవితానికి తన స్నేహితురాలు పింకీ జీవితానికి ఎంతో తేడా. లేలేత వయసులోనే సినిమాల్లో నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి నటించడం కన్నా కాలేజీలో చేరి చదువు కొనసాగించాలనే డ్రీమ్‌ ఉంటుంది. అయితే ఆమె కలలు కల్లలవుతాయి. బలవంతంగా స్కూలు మానిపిస్తుంది ఆమె తల్లి. సెట్లో ఆమెకు ఎన్నో అనుభవాలు. తోటి నటీనటులతో స్నేహంగా ఉండాలని భావిస్తే, వారు దగ్గరకు రానివ్వరు. దాంతో సమూహంలో ఒంటరిగా మారుతుంది. పుస్తకాలే నేస్తాలుగా మారుతాయి. కానీ ‘ఒంటరిగా కూర్చుంటే ఎలా? అందరితో కలవాల’ని తల్లి మందలింపు. డైరెక్టర్‌ శ్రీధర్‌ (గౌతమ్‌ మీనన్‌) ద్వారా శక్తి సినిమా మేకింగ్‌కు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుంటుంది. కెమెరా షాట్‌ ఎలా పెట్టాలో, సీన్‌లో జరిగిన తప్పేంటో… ఆమె చెబుతుంటే దర్శకుడు శ్రీధర్‌ షాక్‌ అవుతాడు. సినిమా పట్ల ఆమెకున్న నిబద్ధతకు ఆశ్చర్యపోతాడు.

Related posts

Leave a Comment