26న సూర్యగ్రహణం… పంచాంగకర్తలు చెబుతున్నదిదే!

ఈనెల 26, గురువారం నాడు సూర్యగ్రహణం సంభవించనుండటం, ఇది దేశమంతా కనిపించనుండటంతో, రాహుకేతు పూజలు జరిపే శైవక్షేత్రాలు మినహా మిగతా అన్ని దేవాలయాలూ మూతబడనున్నాయి. ఈ గ్రహణంపై పంచాంగకర్తలు వివరణ ఇస్తూ, ఏ రాశివారికి మేలు కలుగుతుంది, ఏ రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై వివరణ ఇస్తున్నారు.

ఈ గ్రహణం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య నాడు, మూలా నక్షత్రంలో ధనస్సు రాశియందు తీపాధాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా సంభవించనుంది. గ్రహణ సమయం విషయానికి వస్తే, ఉదయం 8.07కు ప్రారంభమవుతుందని, 9.31 గంటలకు మధకాలమని, 11.20కి ముగుస్తుందని, మొత్తం 3.09 గంటల పాటు గ్రహణం ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ గ్రహణం వృషభం, కన్య, తుల, కుంభ రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో మేషరాశి వారికి చింత, మిధున రాశి వారికి స్త్రీ కష్టం, కర్కాటక రాశి వారికి అతి కష్టం, సింహ రాశి వారికి అశాంతి, వృశ్చిక రాశి వారికి ధన వ్యయం, ధనస్సు రాశి వారికి ప్రాణహాని, మకర రాశి వారికి ఆరోగ్య హాని, మీన రాశి వారికి మనోవ్యధను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో దైవారాధనతో చెడు ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇక ఖగోళ శాస్త్రవేత్తలు, ఈ గ్రహణం కంకణాకారంలో ఏర్పడుతుంది కాబట్టి, చూసేందుకు అద్భుతంగా ఉంటుందని, అయితే, కళ్లకు హాని కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చూడాలని సూచిస్తున్నారు. గ్రహణాన్ని వీక్షించేందుకు ఇండియాలోని పలు సైన్స్ మ్యూజియాలు, ప్లానిటోరియాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

Leave a Comment