మూడేండ్లలోనే కాళేశ్వరం పూర్తి

తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ఈ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అందరికీ అందినట్టే క్రైస్తవులకు కూడా చేయూతనందిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్‌ట్రీని వెలిగించడంతోపాటు కేక్‌ను కట్‌చేసి సీఎం కేసీఆర్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు.

ఆ తర్వాత క్రైస్తవ మతపెద్దలు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు చేశారు. క్రైస్తవులకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పండుగను నిర్వహించడమేకాకుండా క్రైస్తవ భవననిర్మాణానికి రెండెకరాలు, రూ.10 కోట్లు మంజూరు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నడూలేని విధంగా మన ప్రాంతంలో అద్భుతం జరిగిందని, 20, 25 ఏండ్లలో పూర్తిచేసే కాళేశ్వరం ప్రాజెక్టును.. అందరి దీవెనలు, సహకారంతో పట్టుదలతో మూడేండ్లలోనే పూర్తిచేసుకున్నామని చెప్పారు. కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు కలిపి 75 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ కరువున్నా ఈ ప్రాజెక్టు ఆదుకుంటుందని చెప్పారు. వచ్చే జూన్‌నుంచి రైతాంగం పూర్తిలాభం పొందగలుగుతుందని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment