ఏపీకి రాజధానులు మూడు!

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శాసనసభలో కీలక వ్యాఖ్యలుచేశారు. రాజధాని ఒకచోట ఉండాలన్న ఆలోచనాధోరణి మారాలని.. అధికార వికేంద్రీకరణ జరుగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని వల్ల భవిష్యత్ తరాలకు మంచి జరిగేవిధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు రుజువైందని చెప్పారు. ఏపీలో మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఉన్నదన్న సీఎం జగన్.. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చని, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా, విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయవచ్చని తెలిపారు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరుగకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి అడుగు ఆలోచించి వేయాలన్నారు. దక్షిణాఫ్రికాలాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని వెల్లడించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే పెద్దగా ఖర్చుకాదని.. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయని గుర్తుచేశారు. ఒక మెట్రో రైల్ వేస్తే సరిపోతుందని జగన్ చెప్పారు. ఇటువంటి ఆలోచనలకోసం నిపుణులతో వేసిన కమిటీ సుదీర్ఘమైన నివేదికను తయారుచేస్తున్నదని, వారంపదిరోజుల్లో నివేదిక రానున్నదని జగన్ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత రాష్ర్టానికి ఉన్న ఆర్థిక వనరులతో ఏవిధంగా చేయాలో ఆలోచించి నిర్ణయిస్తామని స్పష్టంచేశారు. కాగా, దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కావాలనే అమరావతి రాజధానిని చంపేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిపై జగన్‌కు ఎందుకు కోపమని ప్రశ్నించారు. అమరావతిపై జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.

Related posts

Leave a Comment