ఉప్పల్‌లో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌!

హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధిలో భాగంగా నగరానికి తూర్పువైపున మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రప్రభుత్వం మరో భారీప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. కమర్షియల్‌, డొమెస్టిక్‌ భవనాల నిర్మాణానికి వీలుగా భగాయత్‌ లే అవుట్‌ అభివృద్ధి, మినీ శిల్పారామం ఏర్పాటు, మెట్రోకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనతో దినదినాభివృద్ధి చెందుతున్న ఉప్పల్‌ ప్రాంతంలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నది. హైటెక్స్‌ తరహాలో సదస్సులు, ప్రోత్సాహకాలు, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణ కోసం ఎంఐసీఈ (మీటింగ్స్‌, ఇన్‌సెంటివ్స్‌, కల్చర్‌ ఎగ్జిబిషన్‌) అనే ప్రపంచస్థాయి కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ భారీప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలనే మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

త్వరలోనే దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో లే అవుట్లు వేయగా మిగిలినస్థలంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 10 నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం మూడుదశల్లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 4 వందల కార్లు పార్క్‌ చేసేలా ఏర్పాట్లతోపాటు, హోటల్‌, సేవలందించే అపార్ట్‌మెంట్‌, డార్మిటరీలు, వినోద, వ్యాపార కేంద్రాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మాణాలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Related posts

Leave a Comment