అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చెప్పిందే చేశాం: మోదీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో తాము ఎన్నికల ముందు చెప్పిందే ఇప్పుడు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్ లోని ధన్ బాద్ లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని మేము హామీ ఇచ్చాము. అయోధ్య సమస్య పరిష్కారం అంశాన్ని కాంగ్రెస్ మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ వచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు మార్గం సుగమమైంది’ అని వ్యాఖ్యానించారు.

దేశంలోని ప్రజలందరికీ బీజేపీపై నమ్మకం ఉందని, తాము ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మోదీ అన్నారు. ‘పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు ఆజ్యం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు. దీనివల్ల అసోంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు ఎటువంటి నష్టం జరగబోదని నేను హామీ ఇస్తున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment