ఆర్టీసీ సమ్మె లేబర్‌కోర్టుకు

ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని లేబర్ కోర్టు లేదా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు రెండువారాల్లో రిఫర్ చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తమ తీర్పు కాపీ అందిన రెండువారాల్లో చర్యలు తీసుకోవాలని, ఒకవేళ సమ్మె అంశాన్ని సరైన ఫోరానికి రిఫర్ చేయని పక్షంలో.. అందుకు కారణాలను ఆయాపక్షాలకు లిఖితపూర్వకంగా వెల్లడించాలని సూచించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చే అధికారం తమకు లేదని స్పష్టంచేసింది. తమ అధికార పరిధి మీరి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నది.

ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చేలా ఆదేశించాలని, ప్రజలకు సరైన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాల మధ్య సయోధ్య కోసం తాము తగినంత సమయం ఇచ్చామని, సరైన పరిష్కారానికి వస్తారని వేచిచూశామని ధర్మాసనం పేర్కొన్నది.

Related posts

Leave a Comment