బస్సులకు పర్మిట్లు కేబినెట్‌ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూలు కింద ఉన్న ఏపీఎ్‌సఆర్టీసీని విభజించుకున్నామని, ప్రస్తుతం టీఎ్‌సఆర్టీసీ అస్తిత్వంలోనే ఉందని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. రోడ్డు రవాణా చట్టం-1950లోని సెక్షన్‌ 3 ప్రకారమే టీఎ్‌సఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని, దీనికి ఎలాంటి ఆటంకాలూ లేవని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కోర్టు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం మరోమారు సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్కే జోషి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ఆదేశించింది. అలాగే, టీఎ్‌సఆర్టీసీ ఏర్పాటుకు చట్టబద్ధత లేదని, అది ఉనికిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటూ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు గురువారం కోర్టుకు వివరించిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీని విభజించాలన్నా, పునర్నిర్మించాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దాంతో, 5,100 బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడం సాధ్యమవుతుందా? అన్న సందేహాలు తలెత్తాయి. ఈ అంశాలపై సమీక్షలో కూలంకషంగా చర్చించారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, దీనిపై కోర్టు అభ్యంతరం చెప్పడం ఏమిటంటూ చర్చించారు. ఇందుకు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు ఏమిటంటూ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను సీఎం ఆరా తీశారు. రెండు రాష్ట్రాలూ విడిపోగానే కేంద్ర చట్టాలను అన్వయించుకోవాలని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అధికారులు గుర్తు చేశారు. పైగా.. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగుల విభజన కూడా పూర్తిగా కొలిక్కి వచ్చిందని వివరించారు. కొన్ని ఆస్తుల విషయంలోనే ఇరు రాష్ట్రాల మధ్య పేచీ ఉందని, ఈ అంశం ఉమ్మడి ఆర్టీసీ బోర్డు పరిధిలో ఉందని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు ఉన్న ఈ బోర్డు సమావేశాలు నిర్వహిస్తూ ఆస్తుల పంపకంపై చర్చిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయా అంశాలపై సోమవారం కోర్టులో సరైన వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ విభజన, ఆస్తులు, ఉద్యోగుల పంపకం వంటి పూర్తి సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు.

Related posts

Leave a Comment