అయోధ్యపై తీర్పు ఇవాళే ఎందుకంటే…

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుండడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణకు ముందు రోజు తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ఆయన పదవీ విరమణకు వారం రోజుల ముందే తీర్పు రానుండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తంమవుతోంది. ఈ నెల 17న ఆదివారం రోజు జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కోర్టు ఎప్పుడైనా విచారించి, తీర్పు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ… సాధారణంగా సెలవు రోజుల్లో కీలక తీర్పులు వెలువరించరు. అలాగే న్యాయమూర్తులు పదవీ విరమణ చేసే రోజు కూడా కోర్టు నిర్ణయాలు వెలువడవు. దీనికి తోడు నవంబర్ 16 శనివారం వస్తోంది. ఇక జస్టిస్ గొగోయ్ చివరి పనిదినం నవంబర్ 15 కావడంతో ఆ రోజు గానీ, దానికి ముందు రోజుగానీ తీర్పు వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కోర్టు తీర్పు వెలువరిస్తే… ఆ మరుసటి రోజు ప్రతివాదులు రివ్యూ కోరేందుకు అవకాశం ఉంటుంది. దానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది.

నవంబర్ 14, 15 తేదీల్లో తీర్పు వస్తుందని అటు కేంద్రంగానీ, ఇటు కోర్టు గానీ చెప్పలేదు. అయితేఉన్నట్టుండి శనివారం 10:30లకే తీర్పు వెలువడనుందంటూ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అసాంఘిక శక్తులను కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ఇలా ఉన్నట్టుండి ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఈ కేసు అంత్యంత సున్నితమైనదైనందున అసాంఘిక శక్తులు ఎలాంటి కుట్రలకు సిద్ధపడేందుకు అవకాశం, సమయం లేకుండా చేయడం దీని వెనుక వ్యూహంగా తెలుస్తోంది. కాగా తీర్పు వెలువరించే ముందు రోజే జస్టిస్ గొగోయ్ యూపీ సీఎస్, డీజీపీలతో సమావేశమై భద్రతా ఏర్పాట్లు తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

Related posts

Leave a Comment