కేసీఆర్ పాచిక పారలేదా.. తలొగ్గని ఆర్టీసీ కార్మికులు!

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో సీఎం కేసీఆర్ పెట్టిన గడువు ముగుస్తున్నా.. కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. 48 వేల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత కేవలం 300 మందికి లోపే కార్మికులు విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌లోనే 120 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కూకట్‌పల్లి, కుషాయిగూడ, హయత్ నగర్, మెదక్, గద్వాల, మేడ్చల్, మిర్యాలగూడ, షాద్‌నగర్, నారాయణపేట్, ఖమ్మం తదితర డిపోల్లో పలువురు కార్మికులు విధుల్లో చేరారు.

యూనియన్ల రాజకీయాల్లో పడి, విపక్షాల మాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు తమ బతుకులను ఆగం చేసుకోవద్దని సీఎం కేసీఆర్ గత శనివారం హెచ్చరించారు. విధుల్లో చేరడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం (నవంబర్ 5) అర్ధరాత్రి లోగా విధుల్లో చేరాలని సూచించారు.

కార్మికులు తమ మాట విని పెద్ద ఎత్తున విధుల్లో చేరితే.. ఆర్టీసీ జేఏసీ నాయకులపై వారికే నమ్మకం లేదంటూ ప్రచారం చేసుకోవచ్చని కేసీఆర్ సర్కార్ భావించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ అంశాన్ని హైకోర్టులో వివరించి ఆర్టీసీ వ్యవహారంలో పైచేయి సాధించేలా కుయుక్తులు పన్నారని జేఏసీ నేతలు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాచిక పారలేదని చెబుతున్నారు.

Related posts

Leave a Comment