మంత్రి కేటీఆర్‌కు డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరోసారి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 24వ తేదీవరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే లేఖ పంపించారు. 50 ఏండ్లుగా ప్రపంచంలోని ప్రైవేటువ్యాపార, వాణిజ్యరంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో డబ్ల్యూఈఎఫ్ కీలకపాత్ర పోషిస్తున్నదని బోర్జ్ బ్రెండే తెలిపారు. ఈసారి జరుగనున్న సమావేశానికి సైతం ప్రపంచంలోని కీలక సంస్థల ప్రతినిధులతోపాటు ప్రభుత్వాధినేతలు, కేంద్రస్థాయి మంత్రులను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలతో ముందుకెళ్తున్నదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రభాగాన ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టెక్నాలజీరంగంలో చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయని, ఈ నేపథ్యంలో నాలుగో పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లను తగ్గించడం అనే అంశంపై చర్చించాల్సిందిగా కేటీఆర్‌ను డబ్ల్యూఈఎఫ్ కోరింది. దీంతోపాటు వివిధ అంశాలపై జరిగే చర్చల్లోనూ తెలంగాణ ప్రభుత్వ అనుభవాలను వివరించాల్సిందిగా లేఖలో విజ్ఞప్తిచేసింది. సదస్సుకు హాజరయ్యే వివిధ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమావేశాలు ఏర్పాటుచేసేందుకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధులు వారధిలా పనిచేస్తారని స్పష్టంచేసింది. డబ్ల్యూఈఎఫ్ నుంచి ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పెట్టుబడులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు.

Related posts

Leave a Comment