రాహుల్‌దే బిగ్‌బాస్-3 టైటిల్

ఉత్కంఠకు తెరపడింది. 105 రోజులపాటు ఆసక్తిగా సాగిన బిగ్‌బాస్ సీజన్-3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. బిగ్‌బాస్-3 టైటిల్‌ను ఆదివారం కైవసం చేసుకున్నారు. టీవీ యాంకర్, నటి శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. విజేత రాహుల్‌కు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్రోఫీ, రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. బిగ్‌బాస్ సీజన్-3కి 8.52 కోట్ల మంది ప్రేక్షకులు ఓటు వేసినట్టు కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించిన సినీనటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన రాహుల్ విజేతగా నిలిచారని ప్రకటించారు.

బిగ్‌బాస్-3 విజేతగా నిలిపిన తెలుగు రాష్ర్టాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జూలై 21న ప్రారంభమైన బిగ్‌బాస్-3 షోలో 17 మంది పాల్గొన్నారు. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్‌సందేశ్, అలీరెజా చివరివరకు కొనసాగారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అలీరెజా ఎలిమినేట్ అయినట్టు సినీనటి రాశీఖన్నా, వరుణ్‌సందేశ్ ఎలిమినేషన్‌ను సినీనటి కేథరిన్, నృత్య దర్శకుడు బాబా భాస్కర్ ఎలిమినేషన్‌ను సినీనటి అంజలి ప్రకటించారు. చివరకు షోలో మిగిలిన రాహుల్, శ్రీముఖిలో ఎలిమినేషన్‌ను తానే స్వయంగా ప్రకటిస్తానని యాంకర్ నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోపలికి వెళ్లారు. ఇద్దరికి చెరో రూ.25 లక్షలు ఇస్తాను. పోటీనుంచి విరమించుకుంటారా? అని అడిగారు. దీన్ని ఇద్దరూ తిరస్కరించారు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని, ఓట్లేసిన ప్రేక్షకులు, అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయమని స్పష్టంచేశారు. ఇద్దరినీ బిగ్‌బాస్ హౌస్ నుంచి స్టేజీ మీదకు తీసుకెళ్లిన నాగార్జున.. రాహుల్ సిప్లిగంజ్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించారు.

Related posts

Leave a Comment