దండుమల్కాపూర్ పార్కుకు నేడు ప్రారంభోత్సవం

యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో ఏర్పాటుచేసిన టీఎస్‌ఐఐసీ- టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పార్క్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఐఎఫ్ అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కే నారాయణరెడ్డి ఇప్పటికే పర్యవేక్షించారు. భారీవర్షం వచ్చినా పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు పకడ్బందీగా ప్రత్యేక సమావేశమందిరాన్ని నిర్మించారు. 435 ఎకరాల్లో ఏర్పాటైన ఈ పార్క్‌లో 450 పరిశ్రమలు, రూ.1,553 కోట్ల పెట్టుబడులు రానుండటంతో దాదాపు 35 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతుతో తీర్చిదిద్దిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కును ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం చౌరస్తాలో దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకొని పైలాన్ వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతోపాటు అక్కడ పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కు ఆవరణను పరిశీలించి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు రెండువేల మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Related posts

Leave a Comment