కాగ్నిజెంట్‌లో 7 వేల ఉద్యోగాల కోత

అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెట్‌..ఉద్యోగులకు షాకిచ్చింది. వచ్చే కొన్ని నెలల్లో 12 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమవుతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని ఉన్నతాధికారి ఒకరు సంకేతాలిచ్చారు. కాగా, సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ 497 మిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 477 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.1 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అలాగే, ప్రస్తుత సంవత్సరానికిగాను ఆదాయంలో వృద్ధి 4.6-4.9 శాతం మధ్యలో ఉంటుందని అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 4.25 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. గడిచిన కొన్ని నెలలుగా సంస్థ అన్ని విభాగాల్లో రాణిస్తున్నదని, ఐటీ రంగంలో పోటీ తీవ్రతరమవుతున్నప్పటికీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయని కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియన్‌ హుంఫైర్స్‌ తెలిపారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 10 వేల నుంచి 12 వేల వరకు మధ్యస్థాయి నుంచి సీనియర్‌ లెవల్‌ స్థాయి ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. స్థూలంగా 12 వేల మంది వరకు ఉండనుండగా, నికరంగా మాత్రం 5 వేల నుంచి 7 వేల వరకు అని చెప్పారు. మొత్తం సిబ్బందిలో ఈ వాటా 2 శాతం. భారత్‌లో ఉద్యోగుల తొలగింపు గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంచనా. సెప్టెంబర్‌ 2019 నాటికి సంస్థలో 2,89,900 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, అదే భారత్‌లో ఇటీవల 2 లక్షలు దాటారు. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గత త్రైమాసికంలో సంస్థ 150-200 మిలియన్‌ డాలర్లను నియంత్రించుకోగలిగింది. 2021 నాటికి దీనిని 500-550 మిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని చూస్తున్నది.

Related posts

Leave a Comment