మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: రేవంత్‌రెడ్డి

సాధించాల్సిన లక్ష్యం దూరంగానే ఉందని, అయినా సాధించడం అనివార్యమైందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. కలిసి పోరాడుతామని, విజయం సాధించి తీరతామని ప్రకటించారు. బుధవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరిలో.. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మికులనుద్దేశించి ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. కార్మికుల ఐక్యత వల్లే సమ్మె విజయవంతంగా సాగుతోందని, టీఆర్‌ఎస్‌ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ఉపాఽధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలు ఇస్తున్న మద్దతు తమకు నూతనోత్సాహాన్నిస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తమతో మాట్లాడుతున్నారని అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతకుముందెప్పుడూ ఇలాంటి సభ జరగలేదని, ఎన్ని నిర్బంధాలు విధించినా విజయం తమదేనని ప్రకటించారు.

సమ్మె చట్ట వ్యతిరేకం కాదని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కూడా స్పష్టంగా చెప్పారని, కార్మికులు నిరాశ చెందవద్దని అన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి 24 గంటల దీక్ష నిర్వహిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ‘‘మనం గెలవాలని పోరాడుతున్నాం. ఎప్పటికీ ఆత్మస్థయిర్యంతో ఉంటాం. ప్రభుత్వం ఓడిపోవద్దని ప్రయత్నిస్తోంది. ఎప్పటికైనా పట్టు సడలించాల్సిందే’’ అని అన్నారు. తమ వెనక పెద్ద సమాజం ఉందని, కార్మికులు నిరాశ చెందవద్దని అన్నారు. కాగా కార్మికుల సరాసరి జీతం రూ.50 వేలు అని సీఎం అబద్ధాలు మాట్లాడిన విషయం ప్రజలకు తెలిసిపోయిందని జేఏసీ కోకన్వీనర్‌ కె.రాజిరెడ్డి అన్నారు. అద్దె బస్సులతో లాభం వస్తుందని సీఎం చెబుతున్నారని, కానీ.. గత ఏడాది అద్దె బస్సులతో రూ.149 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. యూనియన్లు ఉండొద్దని సీఎం అంటున్నారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే యూనియన్లను రద్దు చేసుకునేందుకు, తమ పదవులను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Related posts

Leave a Comment