ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యం?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న మొదటి డిమాండ్‌.. మొత్తం చర్చల ప్రక్రియకు ఆటంకంగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాత్రికిరాత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి, ప్రజల ఇబ్బందులు తొలిగించేలా ఆదేశాలు జారీచేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చించాలని గత ఉత్తర్వుల్లో తాము చెప్పామని ధర్మాసనం పేర్కొన్నది. విలీనం అంశంపై పట్టుపబడితే సంక్షోభం మరింత ముదిరిపోతుందని వ్యాఖ్యానించింది. ఆర్థికంగా భారంపడని 21 డిమాండ్లపై చర్చించాలని చెప్పామని గుర్తుచేసింది. కార్మికుల సమస్యల కంటే తమకు ప్రజల సమస్యలే ప్రధానమని తెలిపిన ధర్మాసనం.. ఈ నెల 5 నుంచి జరుగుతున్న సమ్మెవల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. 45 డిమాండ్లలో మొదటి డిమాండ్‌ అయిన విలీనంపై పట్టుబట్టబోమని చెప్తేనే తాము చర్చలు జరుపాలని పేర్కొన్నామని తెలిపింది. కార్మికసంఘాలు హామీ ఇచ్చిన తర్వాతే చర్చల దిశగా ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకున్నట్టుగా ధర్మాసనం గుర్తుచేసింది. మొత్తం డిమాండ్లను ఒకేసారి ముందుకు తెస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో, ఆర్టీసీ కార్మికులకు విశ్వాసం కల్పించేందుకు తాము 21 అంశాలపై చర్చలు జరుపాలని సూచించామని పేర్కొన్నది. విలీనం అంశాన్ని ఒక్క రాత్రిలో తేల్చలేమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి విలీనం డిమాండ్‌ పక్కనపెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటని కార్మిక సంఘాల తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

Related posts

Leave a Comment