ఎస్పీడీసీఎల్‌లో 3,025 ఉద్యోగాలు

రాష్ర్టానికి చెందిన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలోని 3,025 ఉద్యోగాలను భర్తీచేసేందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గతంలోనే ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 2,500, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25.. మొత్తంగా 3,025 పోస్టులను భర్తీచేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పోస్టులు, అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, రిజర్వేషన్లు, ఇతర సమాచారం నోటిఫికేషన్లలో ఇచ్చారు. సంస్థకు చెందిన tssouthpower. cgg. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఈ నెల 30వ నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపునకు గడువు నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఐదు గంటలు.

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 20 రాత్రి 11.59 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. హాల్‌టికెట్లను డిసెంబర్ 11 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను డిసెంబర్ 22న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు అక్టోబర్ 21 నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించేందుకు నవంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండగా.. దరఖాస్తు దాఖలుకు నవంబర్ 10వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు గడువు విధించారు. పరీక్షను డిసెంబర్ 15న నిర్వహిస్తుండగా, హాల్‌టికెట్లను డిసెంబర్ 5 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 22 నుంచి నవంబర్ 10వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అందించవచ్చు. పరీక్ష డిసెంబర్ 15న నిర్వహిస్తుండగా.. హాల్‌టికెట్లను డిసెంబర్ 5 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు.

Related posts

Leave a Comment