హుజూర్‌నగర్‌లో 17న సీఎం సభ

హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 17న టీఆర్‌ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హాజరవుతారని ఆ పార్టీ ఉపఎన్నిక ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సాయిబాబా థియేటర్‌రోడ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సీ ఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ, పార్టీ ఉపఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, సూర్యాపేట జెడ్పీ చైర్‌పర్సన్ దీపికాయుగంధర్‌తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌కు ఇప్పటివరకు చేసిన, తర్వాత చేయబోయే పనులను సీఎం కేసీఆర్ వివరించనున్నారని తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే హుజూర్‌నగర్ అభివృద్ధిలో వెనుకబడిందని, ఈసారి ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఉత్తమ్ గతంలో రెండుసార్లు ప్రజలను మాయమాటలతో మోసంచేశారని, మరోసారి వారిని మోసగించడానికి ఆయన వద్ద ఇంకేమీ లేవని ఎద్దేవాచేశారు. అందువల్లే పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మహిళలు హారతులు ఇచ్చి స్వాగతిస్తున్నారని తెలిపారు.

Related posts

Leave a Comment