హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరిన తమిళిసై.. మోదీ, అమిత్ షాతో భేటీకానున్న గవర్నర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ముగ్గురు ఉద్యోగులు బలన్మరణాలకు పాల్పడిన నేపథ్యంలో సమ్మె ఉద్ధృతమైంది. అటు ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు కానీ ఒక్క మెట్టు కూడా దిగడంలేదు. సమ్మె కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత పరిణామాలు వేగవంతంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోంది. సమ్మెపై గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అంతేకాదు, ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై నివేదికను కోరింది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆమె హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను వారికి వివరించనున్నారు.

Tags: Tamilisai, TelanganaGovernor, Narendra Modi, Amit Shah, RTC Strike

Related posts

Leave a Comment