ఆ ఒక్కటీ మాత్రం అడగొద్దు… మిగతావన్నీ పరిశీలిస్తాం, ఇక సమ్మె ఆపండి… ఆర్టీసీ కార్మికులకు కేకే సలహా

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించారు. కార్మికులు చేస్తున్న డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న విషయం తప్ప మిగతా అన్ని సమస్యలనూ పరిష్కరించే ఉద్దేశం తమకుందని, కార్మికులు వెంటనే సమ్మెకు స్వస్తి చెప్పాలని ఆయన సలహా ఇచ్చారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేయవద్దని సూచించారు. సమస్యకు ఆత్మహత్యలు, బలిదానాలు పరిష్కారం కాదని హితవు పలికిన కేకే, సమ్మె విరమిస్తే, చర్చలకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. విలీనం తప్ప మిగతా డిమాండ్లపై స్పష్టమైన హామీలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని గతంలోనే ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దని చెప్పిన కేకే, ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ఎన్నడూ హామీ ఇవ్వలేదని, ఆ విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ పెట్టలేదని అన్నారు. ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలిగించకుండా కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన సూచించారు.

Related posts

Leave a Comment