ఆర్టీసీకి కొత్త రూపు

ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్నారు. సంస్థ మనుగడకు కొన్నిచర్యలు తప్పవని చెప్పారు. ఈ క్రమంలో ఆర్టీసీలో సగం యాజమాన్య బస్సులు, మరోసగం ప్రైవేటుబస్సులు ఉంటాయని తెలిపారు. ఉద్యోగులు విధుల్లోకి రాని క్యాటగిరీల్లో కొత్తగా నియామకాలు జరుపుతామని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆర్టీసీ ఏటా రూ.1200 కోట్ల నష్టం, రూ.5000 కోట్ల రుణభారం, క్రమంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్‌లో దిగినవారితో ఎలాంటి రాజీలేదని, వారు తీవ్ర తప్పిదంచేశారని సీఎం అన్నారు. వారితో ఎలాంటి చర్చలు జరిపేది స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే ప్రసక్తేలేదని చెప్పారు. భవిష్యత్‌లో ఆర్టీసీలో క్రమశిక్షణారాహిత్యం, బ్లాక్‌మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం విధించిన గడువు లోపు విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేదిలేదని స్పష్టంచేశారు. గడువులోపు విధులకు రానివారు తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్నట్టే భావించాల్సి ఉంటుందన్నారు.

Related posts

Leave a Comment