ఆర్థికప్రగతికి నగరాలే దన్ను

జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు ఇప్పటికీ దేశం పల్లెల్లోనే నివసిస్తున్నదని, అయితే దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తున్నవి కచ్చితంగా నగరాలు, పట్టణాలేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పా రు. గురువారం ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్‌లో మాట్లాడిన కేటీఆర్.. ఆర్థికప్రగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు.

అనేక పాలసీలను నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉన్నప్పటికీ అసలైన కార్యాచరణ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉన్నదని స్పష్టంచేశారు. ఉమ్మడి జాబితాలో అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధి పట్ల విజనరీ కలిగిన నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతాయనేందుకు తెలంగాణనే ఒక ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ గత ఐదున్నరేండ్లుగా అద్భుత పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్నదని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా జీవితంలో మరింత ఉన్నత అవకాశాలకోసం ప్రజలు కచ్చితంగా పట్టణాలవైపు చూస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి అత్యుత్తమ విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పారు. పెద్దఎత్తున పట్టణీకరణ నేపథ్యంలో పట్టణాల్లో మౌలికవసతుల సంక్షోభం తలెత్తుతున్నదని తెలిపారు.

Related posts

Leave a Comment