ఘనంగా బతుకమ్మ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా గురువారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మహిళానేతలు మూల విజయారెడ్డి, ముక్తవరం సుశీలారెడ్డి, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఉమెన్‌సేఫ్టీవింగ్ ఇంచార్జి, ఐజీ స్వాతిలక్రా, పలువురు మహిళా ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారుల సతీమణులు, ఇతర మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో లుంబినీపార్కులో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, అసోసియేట్ అధ్యక్షురాలు బండారు రేచల్, బీటీన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్‌ఫోరం అధ్యక్షుడు టీ పర్వతాలు పాల్గొన్నారు.

ఆడంబరంగా ముగింపు వేడుకలు
బతుకమ్మ సంబురాలు ముగింపు వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం హుస్సేన్‌సాగర్‌తోపాటు బతుకమ్మ ఘాట్ పరిసరాలను బోట్ ద్వారా పరిశీలించారు. సద్దుల బతుకమ్మరోజు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు వేలమంది కళాకారులతో ర్యాలీని నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Related posts

Leave a Comment