చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే షాక్…

Chandrababu-Naidu-

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే… మరోవైపు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పార్టీలో కొనసాగే విషయంలో డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండగా… తాజాగా టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఏకంగా చంద్రబాబు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కాకినాడలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా… ఈ సమావేశానికి రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు.

ఈ కార్యక్రమానికి రావాలని స్వయంగా చంద్రబాబు రాయబారం పంపినా… ఇందుకు త్రిమూర్తులు మాత్రం సానుకూలంగా స్పందించలేదు. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు… త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

పార్టీ మారేందుకు తోట త్రిమూర్తులు సుముఖంగా ఉన్నారని… ఇందుకు సంబంధించి ఆయన వైసీపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన చంద్రబాబు సమావేశానికి సైతం దూరంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి స్వయంగా చంద్రబాబు పిలిచినా… టీడీపీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Leave a Comment