నిజామాబాద్ జిల్లా మెడిక‌ల్ కళాశాల‌లో ర్యాగింగ్

వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో స‌మానం. ఆలాంటి వైద్య వృత్తిని ఎంచుకున్న వారే ర్యాగింగ్ కు పాల్పడటం క‌ల‌కలం రేపుతుంది. ఈ ఘ‌ట‌న‌ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. ర్యాగింగ్ కలకలం ఆలస్యంగా వెలుగుచూసింది. ర్యాగింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులపై చర్యలు చేపట్టారు. ర్యాగింగ్ చేయడం, గంజాయి, మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ మెడికల్ స్టూడెంట్ తన తల్లిదండ్రులతో కలిసి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ స్టూడెంట్ ఫిర్యాదు చేయడంతో గత నెల 29న అధికారులు హాస్టల్ లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్ గా పరిగణించిన ప్రిన్సిపాల్ ఇందిర వారిని హాస్టల్ నుండి సస్పెన్షన్ వేటు వేశారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలోని ముగ్గురు విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు కూడా విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు కళాశాలలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల సూచనలతో మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. హాస్టల్ లో ర్యాగింగ్ వ్యవహారంపై ప్రిన్సిపాల్ ఇందిర సీరియస్ గా పరిగణించారు. మెడిక‌ల్ కళాశాలలో జరుగుతున్న ఘటనపై రాష్ట్ర వైద్య విద్య కమిషనర్ (డీఎంఈ) రమేష్ రెడ్డి నివేదిక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగుతోంది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు సైతం విచారణ చేపట్టారు. ర్యాగింగ్ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క‌ళాశాల ద్వారం వ‌ద్ద నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. కానీ సుమారు 300 మంది విద్యార్థినిలు ఉండే వ‌స‌తి గృహానికి వెళ్లే వెనుక భాగంలో మాత్రం రాత్రి, ప‌గ‌లు తేడాలేకుండా ఎప్పుడూ గేట్లు తెరిచి ఉంచుతున్నారు. దీంతో యువ‌కులు విద్యార్థినుల వ‌స‌తి గృహం వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుంటున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రు పట్టించుకోవ‌డం లేదు.

మెడిక‌ల్ కళాశాల‌లో ఎటువంటి ర్యాగింగ్ జ‌రుగ‌లేదని ప్రిన్సిప‌ల్ ఇందిర అంటున్నారు. కొంత మంది విద్యార్థులపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మాత్రం ఆమె ధ్రువీకరించారు. కొత్తగా వ‌చ్చిన విద్యార్థుల‌కు ఎమైనా ఇబ్బందులు అయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పామన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని అన్ని కళాశాల‌ల్లో యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థుల‌కు ఆవ‌గాహ‌న క‌ల్పించామ‌ని వ‌న్ టౌన్ ఎస్ హెచ్ ఓ అంజ‌నేయులు తెలిపారు.. మెడిక‌ల్ కాలేజ్ లో కూడా విద్యార్థులతో మాట్లాడి యాంటీ ర్యాగింగ్ క‌మిటీని వేయించామ‌ని అయ‌న వివ‌రించారు. విద్యార్థిని ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసిందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న సమాధానం దాటవేశారు.

Related posts

Leave a Comment