తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర..కడియం శ్రీహరి

తెలంగాణలో అసలు సిసలు బాహుబలి సీఎం కేసీఆరే అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి పదవులు కాపాడుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతున్న వాహనాలకు వరంగల్‌లో జెండా ఊపి ప్రారంభించారు కడియం శ్రీహరి. నదీ జలాల్లో హక్కుల కోసం కేసీఆర్ పోరాడుతుంటే కాంగ్రెస్ విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు అవినీతిలో కూరుకుపోయి ఏసీబీ, సీబీఐ, ఈడి కేసులతో జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని కడియం ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర అని… శతాధిక వృద్ధుడైన కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై ఉందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ ఎగిరెగిరి పడుతోందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీజేపీ ఉందా అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదని కడియం అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో గత 5 ఏళ్లలో తెలంగాణకి ఒరగబెట్టింది ఏమీ లేదని కడియం శ్రీహరి దుయ్యబట్టారు.

Related posts

Leave a Comment