అక్టోబర్ 2 నుంచీ ప్లాస్టిక్ ఉత్పత్తులు బ్యాన్

ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేల వంటి ఆరు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని అక్టోబర్ 2 నుంచీ కేంద్ర ప్రభుత్వం నిషేధించబోతున్నట్లు తెలిసింది. ఈ ఆరు రకాల ఉత్పత్తులూ… ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. 2022 నాటికి రీసైక్లింగ్ కాని ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని పూర్తిగా నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ… అక్టోబర్ 2న ప్లాస్టిక్ బ్యాన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి… పై ఆరు రకాల ఉత్పత్తుల్నీ నిషేధిస్తారని తెలిసింది. 2014లో అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్‌ ప్రారంభించిన మోదీ… 2019లో అదే రోజున ప్లాస్టిక్ బ్యాన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. బ్యాన్ విధించిన వస్తువుల ఉత్పత్తి… అక్టోబర్ 2 నుంచీ ఆగిపోతుంది. వాటి వాడకం, దిగుమతులు కూడా నిలిచిపోతాయి. ఇక ఎక్కడా, ఎవరూ ఆ వస్తువుల్ని అమ్మడం, కొనడం, వాడటం వంటివి జరగరాదన్నది కేంద్రం తీసుకురాబోతున్న ఆదేశం. మొదట్లో ఏ జరిమానాలూ విధించకుండా… ఆరు నెలల పాటూ సమయం ఇవ్వాలనుకుంటున్న కేంద్రం… ఆ తర్వాత మాత్రం కఠినమైన ఫైన్లు వేస్తుందని తెలిసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పాలిథిన్ బ్యాగ్‌లను నిషేధించాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులు) వస్తువుల్ని నిషేధిద్దామని ఆగస్ట్ 15న ప్రధాని మోదీ పిలుపిచ్చారు. అందుకు అక్టోబర్ 2ను డెడ్‌లైన్‌గా పెట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే భూమిలో కలవని ప్లాస్టిక్ పదార్థాలు… సముద్రాలు, డ్రైనేజీల్లో పేరుకుపోయి… తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. మనం తాగే నీటిలో, తినే ఆహార పదార్థాల్లో కూడా… ప్లాస్టిక్ అణువులు కలుస్తున్నాయి.

2021 నాటికి స్ట్రాలు, ఫోర్క్స్, కత్తులు, కాటన్ బడ్స్ వంటి వాటిని నిషేధించాలని యూరోపియన్ యూనియన్ టార్గెట్ పెట్టుకుంది. చైనాలోని షాంఘై… క్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తోంది. అలాగే అక్కడి హైనాన్ దీవి… 2025 నాటికి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేస్తామని ప్రకటించింది.

భారత్ రద్దు చేసే ఆరు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులూ… మొత్తం ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో దాదాపు 10 శాతం ఆక్రమిస్తున్నాయి. ఇండియా ఏటా 1.40 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తోంది. నిషేధం తర్వాత… రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్ పదార్థాల్ని మాత్రమే ఉత్పత్తి చేస్తారని సమాచారం. ఈ-కామర్స్ కంపెనీలు సైతం… ఈ రూల్స్ పాటించాలని కేంద్రం ఆదేశించనుంది. మొత్తం ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో ఈ కంపెనీలు 40 శాతం వాటా కలిగివున్నాయి.

Related posts

Leave a Comment