టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఎక్కడా?

టీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగినా.. అందులో హరీశ్ రావు ఎక్కడా? అని ఆరా తీసేవాళ్ల సంఖ్య ఎక్కువే. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ట్రబుల్ షూటర్‌ ప్రాధాన్యతను తగ్గించేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హరీశ్ అభిమానులైతే కేసీఆర్ తమ నేతను తొక్కేస్తున్నాడని సోషల్ మీడియాలో బహిరంగంగానే వాపోతున్న పరిస్థితి. కేటీఆర్‌‌కు పగ్గాలు అప్పజెప్పేందుకే హరీశ్ రావును కేసీఆర్ క్రమంగా సైడ్ చేసేస్తున్నారని ప్రత్యర్థులు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు మంచి నాయకుడని, అభివృద్ది కోసం ఆరాటపడుతారని.. అలాంటి నాయకుడిని వాడుకుని వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో,కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హరీశ్‌ను బాగా వాడుకుని పక్కనపెట్టేశారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, త్వరలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణపై లీకులు మొదలయ్యాయి. ఇందులో కేటీఆర్‌కు మంత్రి పదవి ఖాయం అని ఊహాగానాలు వినిపిస్తుండగా.. హరీశ్ పేరు మాత్రం వినిపించడం లేదు. దీంతో హరీశ్ రావుకు మంత్రి పదవి లేనట్టేనా? అన్న చర్చ ఊపందుకుంది. తమ నాయకుడికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న హరీశ్ అభిమానులు.. ఈ నిర్ణయంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది. హరీశ్ రావుపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని వారు రగిలిపోతున్నట్టు సమాచారం.ఒకవేళ కేటీఆర్‌కు మంత్రి పదవి దక్కి.. హరీశ్‌ను గనుక మంత్రివర్గంలో చేర్చుకోకపోతే కోమటిరెడ్డి ఆరోపించినట్టే.. హరీశ్ అభిమానులు కూడా ఆయన్ను వాడుకుని వదిలేశారని కేసీఆర్‌ను నిందించవచ్చు. హరీశ్ వర్గంలో ఈ రకమైన అసంతృప్తి పార్టీకి చేటు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఎవరేమనుకున్నా తన నిర్ణయమే అల్టిమేట్ అన్నట్టుగా వ్యవహరించే కేసీఆర్.. హరీశ్ విషయంలో తాను అనుకున్నదే చేస్తారా..? లేక పునరాలోచనలో పడుతారా..? అన్నది వేచి చూడాలి.

Related posts

Leave a Comment