రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం…

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీలోకి వెళుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించి… తన పొలిటికల్ జర్నీ కాంగ్రెస్‌తోనే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన టీ పీసీసీ చీఫ్‌గా ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారనే అంశం ఆసక్తిరేపుతోంది. నిజానికి టీ పీసీసీ చీఫ్ బాధ్యతలు నుంచి తప్పుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగానే ఉన్నా… ఇప్పటికప్పుడు ఆ పదవిని తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇందుకు ప్రత్యేకమైన కారణంగా ఉందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని టీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో… ఆ ఎన్నికలు పూర్తయిన తరువాతే టీ పీసీసీ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే… ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు ఉండవు. దీంతో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తరువాత టీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి పార్టీలో అనేక మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. 

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే… క్షేత్రస్థాయి నుంచి ఆ పని చేయాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత ఇందుకోసం సమయం ఉంటుందని… అప్పుడు పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకుని ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో తన భవిష్యత్ కార్యాచరణ విషయంలో రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

Related posts

Leave a Comment