తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన

అప్పుడెప్పుడో జూన్‌లో కురవాల్సిన వానలు.. ఇప్పటిదాకా జాడ లేదు.. పత్తా లేదు.. జూలైలోనైనా కురుస్తాయేమో అనుకుంటే అదీ లేదు. దీంతో అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. మబ్బుల వంక దీనంగా చూస్తున్నారు. చినుకు రాలుతుందిలే అనుకుంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డాక్టర్ నాగరత్న చల్లని కబురు అందించారు. ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున తూర్పు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాయలసీమ, తెలంగాణ, కోస్తాలో తక్కువ నుంచి మోస్తరు వానలు పడతాయని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. 

ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాలో తక్కువ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న వివరించారు. తెలంగాణలో ఈ రోజు, రేపు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

Related posts

Leave a Comment