బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ మాజీ నేత

తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరనున్నారు. కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, ఇతర విపక్షాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో జి.వివేక్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈనెల 23న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో లాంఛనంగా చేరతారని సమాచారం. వివేక్‌తోపాటు మరికొందరు నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా రేపు బీజేపీలో చేరే అవకాశం ఉంది.

జి.వివేక్ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. ఆయన తండ్రి జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేత. ఆయన వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ప్రజా జీవితంలో కూడా వెంకటస్వామి బాటలో నడిచారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మళ్లీ హస్తం గూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మరోసారి వివేక్ టీఆర్ఎస్ గూటికి చేరారు.

2019 ఎన్నికల సందర్భంగా తనకు పెద్దపల్లి ఎంపీగా టికెట్ దక్కుతుందని వివేక్ భావించారు. అయితే, ఆయనకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. వెంకటేష్ నేత అనే లీడర్‌కు టికెట్ కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన వివేక్… టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కారు పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా ప్రజాసంఘాలతో కలసి పలు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీంతో వివేక్ కూడా వెంటనే అంగీకరించినట్టు సమాచారం.

Related posts

Leave a Comment