ఏపీకి కొత్త గవర్నర్… నరసింహన్ తెలంగాణకే పరిమితం ?

ఏపీకి కొత్త గవర్నర్ ఎంపికయ్యారు. ఒడిషాకు చెందిన బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన త్వరలోనే ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీకి కొత్త గవర్నర్ ఎంపిక ఖరారు కావడంతో… ఇంతకాలం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ తెలంగాణకే పరిమితమవుతారా అనే చర్చ మొదలైంది. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం… తెలంగాణకు మాత్రం మరొకరిని గవర్నర్‌గా నియమించలేదు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు గవర్నర్’గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఇక తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌కు స్థానచలనం ఉంటుందని చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పెద్దల దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్న నరసింహన్… ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించే విషయంలో తనవంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దీంతో నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించడం ద్వారా మళ్లీ కొత్త సమస్యలు వస్తాయని భావించిన కేంద్రం… ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తూ వచ్చింది.

తాజాగా ఏపీకి ప్రత్యేకంగా కొత్త గవర్నర్‌ను నియమించడంతో… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికప్పుడు నరసింహన్‌ పదవికి ఢోకా లేకపోయినప్పటికీ… సమీప భవిష్యత్తులో ఆయనకు స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Related posts

Leave a Comment