తేలు మంటను తగ్గించేందుకు ఫోన్ ద్వారా మంత్రాలు

తేలు మంటతో బాధపడుతున్న ఓ బాలుడికి ఫోన్ ద్వారా మంత్రలు జపిస్తే.. ఆ నొప్పి తగ్గుతుందా? కానీ ఓ ప్రధానోపాధ్యాయుడు మూఢనమ్మకంతో.. తేలు కుట్టిన విద్యార్థికి మాంత్రికుడి చేత ఫోన్‌లో మంత్రాలు వినిపించాడు. ఆ లోపే విద్యార్థి శరీరమంతా పాయిజన్ సోకి మృతి చెందాడు. ఈ  ఘటన  ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

యూపీలో పాఠశాలలు ఇటీవలే పునఃప్రారంభం కావడంతో.. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ఆదేశించాడు. దీంతో విద్యార్థులు చెత్తను తొలగిస్తున్న క్రమంలో ఓ విద్యార్థి(10)కి తేలు కుట్టింది. మంటతో బాధపడుతున్న విద్యార్థిని ఆస్పత్రికి తరలించకుండా.. ఓ మాంత్రికుడి ఇంటికి తరలించారు.

ఆ మాంత్రికుడు ఇంటి వద్ద లేకపోయే సరికి సదరు ప్రధానోపాధ్యాయుడు.. అతడికి ఫోన్ చేసి.. ఆయన ఫోన్‌లో మంత్రాలు జపిస్తుంటే.. ఆ ఫోన్‌ను బాధిత విద్యార్థి చెవి వద్ద పెట్టాడు. కానీ మంట తగ్గలేదు. ఆ తర్వాత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులు స్పందించారు. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Related posts

Leave a Comment