విజయవాడ ఎంపీని అర్థం చేసుకోలేకపోతున్న టీడీపీ

గత ఎన్నికల్లో ఏపీలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆయన తీరు పార్టీకి అస్సలు అర్థం కావడం లేదు. ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నాని కలవడంతో ఆయన బీజేపీలోకి వెళతారనే ఊహాగానాలు వినిపించాయి. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని అసంతృప్తి వ్యక్తం చేసిన కేశినేని నానిని స్వయంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి పిలిచి మరీ మాట్లాడారు. అయినప్పటికీ ఆయన మాత్రం శాంతించినట్టు కనిపించలేదు.

దీంతో టీడీపీ నాయకత్వం కూడా కేశినేని నానిని పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రజావేదిక కూల్చివేతపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేశినేని నాని… తాజాగా బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని బీజేపీ, వైసీపీని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా… చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన మాత్రం ఆయన ఎక్కడా తీసుకురావడం లేదు.

అయితే తనకు తాను ఓ స్వతంత్ర్య ఎంపీ అన్నట్టుగా ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కేశినేని నాని ఇతర పార్టీలను టార్గెట్ చేయడం బాగానే ఉన్నా… ఆయన టీడీపీని, టీడీపీ అధిష్టానం ప్రస్తావన తీసుకురాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి కారణంగానే ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారేమో అని చర్చించుకుంటున్నారు.

Related posts

Leave a Comment