చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరలో చేపడుతామని ఆస్పత్రి చైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదిన వేడుకలను సోమవారం బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ముందుగా దివంగత నందమూరి బసవతారకం, రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల మధ్య కేక్‌ను కట్‌ చేసి వారికి తినిపించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆస్పత్రి స్థాపన సమయంలో దివంగత ఎన్టీఆర్‌ ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా దేశంలోనే అత్యున్నత శ్రేణి కేన్సర్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆస్పత్రి స్థాపనలోనూ, నిర్వహణలోనూ సహాయం అందిస్తున్న పలువురు దాతలకు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, ఆరోగ్య శ్రీ రోగులకు బాలకృష్ణ పండ్లు పంపిణీ చేశారు. వారి ఆరోగ్య వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో డాక్టర్‌ ప్రభాకరరావు, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎ్‌సరావు, సీవోవో రవికుమార్‌, వైద్యులు కల్పనా రఘునాథ్‌, కోటేశ్వరరావు, సెంథిల్‌ రాజప్ప, ఏకే రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment