బెదిరింపులకు.. కేసులకు భయపడను: రేవంత్

పాలకుల బెదిరింపులకు బెదిరేది లేదు… అక్రమంగా పెట్టే కేసులకు భయపడేది లేదు… ప్రలోభాలకు లొంగేది లేదు.. ప్రజలిచ్చిన నమ్మకాన్ని ఏ పరిస్థితిలోనూ వమ్ముచేయను.. ప్రజల తరఫున వారి సమస్యలపైన రాజీలేని పోరాటం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆదివారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో ఏర్పాటుచేసిన ప్రజా కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అతి పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, ఏ నమ్మకంతోనైతే ఇంతటి విజయాన్ని అందించారో వారి నమ్మకానికి తగ్గట్లుగా వారి గొంతుకనై పనిచేస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, కేసీఆర్‌ పోకడలపై తన పోరాటం సాగుతుందని, కేంద్రంలో మోదీకి సైతం తాను భయపడనని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానంటూ హామీనిచ్చారు. రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజిగిరిని, ఇక్కడి సమస్యలను ఇప్పటికే అధ్యయనం చేశానని, పార్లమెంటు సమావేశాల్లోగా పూర్తి స్థాయిలో ఓ నివేదిక తయారు చేసి, ఆ సమస్యల పరిష్కారానికి కేంద్ర రైల్వే మంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు.

సమావేశాల అనంతరం తానే నియోజకవర్గంలో తిరిగి తనకు సహకరించిన కాలనీ పెద్దలను, సంఘాలను కలిసి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారి సమస్యలు సైతం అధ్యయనం చేస్తానన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో తానే తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తానని, వారి విజయాన్ని తన భుజాలపై వేసుకుంటానన్నారు. నియోజకవర్గంలో తనకు రెండు కళ్లుగా ఉన్న జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌లను కాపాడుకుంటానని, వారికి ఏ విషయంలో అన్యాయం జరుగదంటూ హామీనిచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అందరూ తనకు సమానమేనని నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా శ్రమిస్తానంటూ ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య హామీనిచ్చారు.

నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌, కార్మిక నాయకుడు చంద్రశేఖర్‌, నాయకులు లింగారెడ్డి, సిరిగిరి నర్సింగరావు, జీడి శ్రీనివా్‌సగౌడ్‌, వేముల వెంకటేష్‌, ఆందోని, వేణునాయుడు, చాకో, సీపీఐ నాయకుడు బాలమల్లేష్‌, దశరథ్‌, యాదయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment