ప్రముఖ సినీ నటుడు గిరీష్‌కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలు నాటకాలు రచించి ఆయన వెలుగులోకి వచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.

జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనందభైరవి చిత్రంతో కర్నాడ్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ దాదా-ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్, ధర్మచక్రం తదితర తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా.. బుల్లితెరపై సంచలన విజయం సాధించిన ‘మాల్గుడి డేస్’ అనే సీరియల్‌లోనూ ఆయన నటించారు. చివరిగా అప్నా దేశ్ అనే కన్నడ సినిమాలో ఆయన నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 26న విడుదలకానుంది. మద్రాస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తున్న సమయంలో డా.సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాళ్లు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

సాహిత్యంలోనూ మంచి పట్టు ఉన్న ఆయనకు 1998లో సాహిత్య అకాడమీ వాళ్లు జ్ఞానపీఠ్ అవార్డును ప్రధానం చేశారు. అంతేకాక.. సాహిత్య రంగంలో ఆయన అందించన సేవలకు భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చింది. సినిమాలకు సంబంధించి ఆయన ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Tags :Death, Girish Karnad, Bengaluru, Tollywood

Related posts

Leave a Comment