నేడు కొలువుదీరనున్న జగన్ క్యాబినెట్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శనివారం కొలువుదీరనున్నది. ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. మొత్తం 25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు చెందినవారు ఉంటారని వెల్లడించారు. ఉపముఖ్యమంత్రులుగా పుష్పశ్రీవాణి (ఎస్టీ), సుచరిత (ఎస్సీ), అంజద్‌బాషా (మైనార్టీ), ఆళ్ల నాని (కాపు), ధర్మాన కృష్ణదాస్ (బీసీ)లకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.

రాష్ట్ర క్యాబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించడం ఇదే ప్రథమం. రెండున్నరేండ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, అప్పుడు కొత్తవారికి అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో సగం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తామన్నారు. మంత్రివర్గంలో స్థానం పొందినవారికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్‌చేసి సమాచారం అందిస్తారని చెప్పారు. రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తున్నది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గరచేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలనజరుగాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి జ్యుడిషియల్ కమిషన్ గురించి అడిగా. ఇకనుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగాలి.

Related posts

Leave a Comment