కారెక్కిన కాంగ్రెస్

రాష్ట్ర కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకంలేని ఆ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఇదే రుజువైందని, తాము కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడానికి టీఆర్‌ఎస్‌లో విలీనమవ్వాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ మేరకు తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ గురువారం ఉదయం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి లేఖ ఇచ్చారు. తమను రాజ్యాంగబద్ధంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని కోరారు. అసెంబ్లీలో ఏదైనా పార్టీ సభ్యులు మరో పార్టీలో విలీనం కావాలంటే.. మూడింట రెండొంతుల మంది సుముఖత వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమయ్యారు. కొంతకాలం క్రితం శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇదే పద్ధతిలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా పరిణామంలో కాంగ్రెస్‌కు చెందిన మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తంచేయడంతో వారి విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు.

ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనంచేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు గురువారం సాయంత్రం బులెటిన్ విడుదలచేశారు. ఇకపై ఈ 12 మంది టీఆర్‌ఎస్ సభ్యులుగా కొనసాగనున్నారు.

Related posts

Leave a Comment