అసాధారణ విజయమిది

K.Tarakaramarao-TRS

‘‘డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా ఏకపక్ష తీర్పు ఇచ్చారో ‘పరిషత్‌’ ఎన్నికల్లో దాన్ని తలదన్నే తీర్పును ప్రజలు ఇచ్చారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా విజయం సాధించడం అసాధారణమైన విషయం. ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే 32కు 32 జిల్లా పరిషత్తుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను కైవసం చేసుకోబోతున్నాం. దేశ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి ఏకపక్ష తీర్పు రాలేదు. ఇదొక చరిత్రాత్మక విజయం’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘పరిషత్‌’ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించాం. ఈ పరిషత్‌ ఎన్నికల్లో 32కు 32 జడ్పీ పీఠాలను సాధించాం. 90 శాతానికిపైగా ఎంపీపీలను కూడా గెలుచుకోబోతున్నాం. కేసీఆర్‌పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రజలు ఏకపక్షమైన తీర్పును ఇచ్చి మా బాధ్యతను మరింత పెంచారు. ఇది గెలుపు కాదు. ప్రజలు టీఆర్‌ఎ్‌సపై పెట్టిన బాధ్యత. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని అన్నారు. గెలవగానే గేలి చేసినట్లు మాట్లాడడం విజ్ఞత అనిపించుకోదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి ప్రతిపక్షాలు ఓడినంత మాత్రాన ఇదే ఫైనల్‌ కాదని వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే కరీంనగర్‌, నిజామాబాద్‌ జడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇప్పటి వరకు ఐదుసార్లు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొందని, కానీ, టీఆర్‌ఎస్‌ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయమని అన్నారు. బ్యాలెట్‌ అయినా, ఈవీఎం అయినా కేసీఆర్‌పై నమ్మకంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలకుగాను 6 జిల్లాల్లో ప్రతిపక్షాలు ఖాతా కూడా తెరవలేదని, మరో ఆరు జిల్లాల్లో కేవలం ఒకే స్థానానికి పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో 7 జడ్పీటీలకు 5; సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలో 5 స్థానాల్లో 4 టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుందని చెప్పారు. తాము గెలిచినప్పుడు ఎలా ఉన్నామో ఓడినప్పుడు కూడా అలాగే ఉంటామని అన్నారు. పార్టీ కనుమరుగైపోతుందోమోనన్న దశకు కూడా టీఆర్‌ఎస్‌ ఒకప్పుడు చేరుకుందని గుర్తు చేశారు.

Related posts

Leave a Comment