లోక్‌సభ ఎన్నికలు @ రూ.60 వేల కోట్లు!

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకంగా 60 వేల కోట్ల రూపాయలను వ్యయం చేశాయి. సగటున ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి రూ.100 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే మేథో సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎన్నికల వ్యయంపై సీఎంఎస్ ఢిల్లీలో సోమవారం చర్చా కార్యక్రమం నిర్వహించింది. దీనికి కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషి హాజరయ్యారు. దేశంలో ఎన్నికల ఖర్చు భారీగా పెరుగడంపై సీఎంఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయం పెరిగేకొద్దీ ఎన్నికల ప్రచారం కూడా దుర్మార్గంగా, అసహ్యంగా తయారవుతుందని తాజా ఎన్నికల ద్వారా తేలిందని సీఎంఎస్ పేర్కొంది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేశారని, ఇందులో ఎన్నికల సంఘం అధికారికంగా ఖర్చు చేసినది 15-20 శాతం ఉంటుందని సీఎంఎస్ నివేదిక వెల్లడించింది. ప్రచార వ్యయం, ఎన్నికల ఫండింగ్‌పై పార్లమెంట్ సమాలోచనలు జరుపాల్సిన సమయం ఆసన్నమైందని నివేదిక స్పష్టంచేసింది. ఎన్నికల వ్యయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నివేదిక విడుదల చేసినట్లు సీఎంఎస్ చైర్మన్ భాస్కర్‌రావు తెలిపారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించామని, అయితే ఎవరూ హాజరుకాలేదని చెప్పారు. ఎన్నికల వ్యయానికి ప్రధాన వనరు కార్పొరేట్ వర్గాలేనని, పారదర్శకత పేరుతో ఫండింగ్ ప్రక్రియలో గోప్యతను ప్రోత్సహిస్తున్నారని నివేదిక ఆరోపించింది. అలాగే ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల బయోపిక్‌ల ఒరవడి ఈ ఎన్నికల్లోనూ కొనసాగిందని, అంతేగాకుండా డీటీహెచ్ చానళ్ల ద్వారా 24 గంటల పాటూ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొంది. దీనిని ఎన్నికల వ్యయంగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది.

Related posts

Leave a Comment